ఓపక్క ఇంధన ధరలు చుక్కలనంటుతున్నాయి. వాటి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పర్యావరణాన్నికాపాడుకోవడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు కొందరు. అవే ఇప్పుడు వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే ఇంధన ఖర్చులు తగ్గించుకుందామని ఈ ఎలక్ట్రిక్ బైక్ లను కొనుగోలు చేస్తుంటే.. అవి కాస్తా పేలిపోతున్నాయి.
తాజాగా సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో ఎలక్ట్రిక్ బైక్ పేలిపోయింది. కొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేశారు. రాత్రి తన ఇంటి ముందు ఉన్నదుర్గయ్య నివాసం వద్ద బైక్ ను పార్క్ చేశారు.
రాత్రి 12 గంటల సమయంలో పెద్ద శబ్ధం రావడంతో బయటకు వచ్చిన లక్ష్మీ నారాయణకు బైక్ పేలి పక్కనే ఉన్నదుర్గయ్య ఇంటికి మంటలు అంటుకోవడం చూశారు.వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.వారు వెంటనే వచ్చిమంటలను అదుపు చేశారు.
ఈ ఘటనలో దుర్గయ్య ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అయితే… ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.