అధికారపార్టీ అండతో ఓ సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. భర్త డెత్ సర్టిఫికెట్ కోసం వెళ్లిన వితంతువును కోరిక తీర్చమని వేధించాడు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మైసంపల్లిలో జరిగిందీ ఘటన.
గ్రామానికి చెందిన ఓ వితంతువు.. భర్త డెత్ సర్టిఫికెట్ కోసం పంచాయితీ సెక్రటరీని ఆశ్రయించింది. అప్పటికే సర్పంచ్ భర్త గందమల్ల రాజ ఎల్లయ్య ఆ సర్టిఫికెట్ ను తన దగ్గర పెట్టుకున్నాడు. నీకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తా.. అన్ని రకాలుగా తోడుగా ఉంటానంటూ మాయ చేయబోయాడు. దానికి నిరాకరించడంతో తనను వేధింపులకు గురి చేశాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది.
గత మూడు నెలల నుండి భర్త డెత్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఎల్లయ్యపై పోలీసులకు కంప్లయింట్ చేసింది బాధితురాలు. అధికారపార్టీ నేత కావడంతో పోలీసులు ముందూ వెనకా ఆలోచించారు. అతడ్ని పిలిపించి విచారించారు. అయితే సర్పంచ్ భర్త రివర్స్ లో బాధిత మహిళపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. తన ఫిర్యాదుపైనా కేసు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోతోంది బాధిత మహిళ. న్యాయం కోసం.. మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.