పంజాబ్ లో సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసావాల హత్య సంచలనం రేపుతోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సిద్దూకు భద్రతను తగ్గించిన మరుసటి రోజే ఆయన హత్యకు గురికావడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో ఆప్ సర్కార్ పై ప్రతి పక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఇక సిద్ధూ హత్యకు గురైన 24 గంటల తర్వాత ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. సిద్దూకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, ఇతరుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు. ఆయనకు ప్రాణహాని ఉందని తాము భయపడినట్టు సిద్దూ తండ్రి బాల్కోర్ సింగ్ తెలిపారు.
ఈ కేను కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ లేదా సీబీఐ చేత విచారణ జరిపించాలని సిద్దూ తండ్రి డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం సెక్యూరిటీ లేకుండానే సిద్దూ బయటకు వెళ్లినట్టు గ్రహించానని, దీంతో కొద్ది సేపటికి సెక్యూరిటీని తన జీపులో ఎక్కించుకుని సిద్దూ వెనక తాను కూడా వెళ్లినట్టు ఆయన తండ్రి చెప్పారు.
సిద్దూ బుల్లెట్ ప్రూఫ్ కాకుండా సాధారణ వాహనంలో వెళ్లాడని, ఇంటి నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే మరో రెండు వాహనాలు సిద్దూను ఫాలోచేశాయని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటెజ్ లో ఉన్నట్టు వివరించారు.
ఆ రెండు వాహనాల్లో నలుగురు చొప్పున మొత్తం ఎనిమిది మంది ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. ఆ రెంటిలోని ఓ వాహన డ్రైవర్ సిద్దూపై మొదట కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. ఆ తర్వాత దాదాపు 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టు ఆయన వివరించారు.