రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని డిమాండ్ చేశారు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వరలక్ష్మి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు మహిళా కాంగ్రెస్ నేతలు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం ముందు బైఠాయించారు.
రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో రోజు అత్యాచారం జరుగుతున్నప్పటికీ.. ప్రభుత్వం గానీ.. పోలీసు యంత్రాంగం కానీ.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు వరలక్ష్మి. చిన్నపిల్లపై అత్యాచారాలు జరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలపై, చిన్నారులపై, హత్యలు అత్యాచారాలు దాడులు చేస్తున్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.