కొత్త ప్రైవసీ పాలసీ వాట్సాప్ కొంపముంచుతోంది. యూజర్ల డేటాను ఫేస్‌బుక్ భాగస్వామ్య కంపెనీలతో పంచుకునేందుకు వాట్సాప్ సిద్ధమవుతుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు గోప్యత అంశమే తమ బలంగా చెప్పుకున్న వాట్సాప్.. ఇప్పుడే స్వయంగా రూల్ బ్రేక్ చేయడంపై యూజర్లు ఫైర్ అవుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా సిగ్నల్ వైపు మొగ్గుచూపుతున్నారు.
తాజాగా సిగ్నల్ యాప్‌కు డౌన్‌లోడ్లు వెల్లువెత్తాయి. యూజర్లు ఎంతలా సిగ్నల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారంటే.. యాప్‌స్టోర్‌లో ఇప్పుడు టాప్ ఫ్రీ యాప్‌గా సిగ్నల్ కనిపిస్తోంది. ముఖ్యంగా నాలుగు రోజులుగా సిగ్నల్ యాప్‌కు డౌన్‌లోడ్స్ పోటెత్తాయి. సిగ్నల్ సంస్థ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఒక్కసారిగా డౌన్‌లోడ్లు పెరగడంతో వెరిఫికేషన్స్ ఆలస్యం అవుతున్నాయని.. ఈ సమస్యను అధిగమిస్తామని ఆ సంస్థ తెలిపింది.
వాట్సాప్ ఇటీవల తమ ప్రైవసీ పాలసీలో మార్పులు చేసింది. ఫిబ్రవరి 8 నాటికి తమ రూల్స్‌ని అంగీకరించకపోతే.. అకౌంట్ డిలీట్ అవుతుందని హెచ్చరిస్తోంది. మరోవైపు కొత్త నిబంధనలని అంగీకరిస్తే.. వాట్సాప్ యూజర్లు వాడే ఫోన్‌లోని వివరాలన్నీ కూడా వాట్సప్‌కు తెలుస్తాయని అంటున్నారు. వీటినే వాట్సాప్ తమ మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది.