మార్చి 8వ తేదీ (రేపే) నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నా.. ప్రధాన పార్టీల్లో అ సందడే కనిపించడం లేదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సాగు చట్టాలు, పెట్రో ధరల పెంపు వంటి సీరియస్ అంశాలు ఉన్నా.. వాటిపై ఆయా పార్టీలు పెద్దగా కసరత్తు చేస్తున్నట్టు కనిపించడం లేదు. దీంతో రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేది అసలు రేపటి ( మార్చి 8) నుంచేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఇందుకు కారణమూ లేకపోలేదు.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ, ఇతర రాష్ట్రాల్లోనూ స్థానిక, చట్ట సభలకు సంబంధించి ఖాళీ అయిన స్థానాలక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆయా ఎలక్షన్స్‌పైనే దృష్టిసారించాయి. దీంతో మొదటి విడత జరిగినప్పటి సమయంలో ఉన్న సీరియస్‌నెస్ కూడా లేకుండాపోయింది.
తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమై..ఫిబ్రవరి 13వరకు జరిగాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాత తీర్మానం అనంతరం ఫిబ్రవరి 13న సమావేశాలను వాయిదా వేశారు. రేపటి నుంచి ప్రారంభకానున్న రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగుతాయి.