కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సింహాచలం దేవస్థానంలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం నుంచి మార్చి 31వ తేదీ వరకు ఇవి అమలులో ఉంటాయి. గురువారం మధ్యాహ్నం నుంచి మార్చి 31వ తేదీ వరకు భక్తులు తలనీలాలు సమర్పించే కేశఖండనశాలను మూసివేయనున్నారు. స్వామివారి అన్నప్రసాద భవనంలో భక్తులను భోజనాలకు అనుమతించరు. బదులుగా పొంగలి, దద్యోజనం వంటి ప్రసాదాలను పొట్లాల ద్వారా పంపిణీ చెయ్యనున్నారు. దేవాలయంలోకి భక్తులు ప్రవేశించే చోట చేతులు, కాళ్లు శుభ్ర పరచుకునేందుకు సబ్బు, శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు. థర్మల్ గన్‌లతో భక్తులను పరిశీలించిన తర్వాతే దర్శనాలకు అనుమతి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐ, విదేశాల నుంచి వచ్చే భక్తులను 14 రోజులలోపు ఆలయంలోకి అనుమతి ఉండదు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న భక్తులను దేవాలయంలోకి అనుమతిటించబోమని కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. దేవస్థానం ప్రాంగణంలో ఉమ్మి వేయడం, ముక్కు చీదడం నిషేదించాము. ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నాము.
ఉగాది, శ్రీరామనవమి వంటి ఉత్సవాల్లో సైతం భక్తులు సామూహికంగా పాల్గొనేందుకు అవకాశం లేదు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఉత్సవాలను తిలకించే అవకాశం కల్పిస్తాము. ఆర్జిత సేవలు మినహా స్వామికి జరగాల్సిన సేవలు, నివేదనలు, పూజలు యథావిధిగా జరుగుతాయి. భక్తులకు పాల్గొనే అవకాశం మాత్రం ఉండదు. దేవస్థానం సత్రాల్లో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు అమలు చేయనున్నాము. ఇతర కరోనా నియంత్రణ చర్యలపై ఆలయ అధికారులు, వైదికులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈవో తెలిపారు. 60ఏళ్లు దాటిన వృద్ధులు, 10ఏళ్లలోపు పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు ఆలయ సందర్శనను వాయిదా వేసుకోవాలని ఈవో కోరారు.సింహగిరిపై పవిత్ర గంగధార, కొండ దిగువన పుష్కరిణి చెరువులో భక్తులను సామూహిక పుణ్య స్నానాలకు అనుమతించబోమని ఆలయ అధికారులు తెలిపారు.