ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులకు వ్యతిరేకంగా తన గళం విప్పి వార్తల్లోకి ఎక్కారు. శుక్రవారం వరుస ట్వీట్లతో దాడికి దిగారు. లైంగిక వేటగాళ్ళు ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే మహిళలు ఎలా సురక్షితంగా భావిస్తారని ప్రశ్నించారు.
స్త్రీగా ఉండి మీ వేధింపులకు పేరు పెట్టడం ఎందుకు కష్టమో తెలుసా? ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి.. గౌరవనీయులైన కేరళ ముఖ్యమంత్రి.. రాహుల్ గాంధీ.. గౌరవప్రదమైన ఎంపీ కనిమొళితో కలిసి అతడు వేదికను పంచుకున్నాడు. ఆ కార్యక్రమంలో మిస్టర్ కమల్ హాసన్.. మిస్టర్ రజనీకాంత్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. అని ఆమె తన ట్విట్టర్ పేజీలో రాశారు.
స్త్రీలపై పురుషులు వేధింపులకు పాల్పడితే దేశంలోని రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఇప్పటికే 20 మంది మహిళలు తమకు జరిగిన వేధింపుల గురించి తనకు తెలిపారని ఆమె వెల్లడించారు.
ట్విట్టర్ లో ఒక వ్యక్తి వాటికి రుజువు కావాలని అడిగాడు. దానికి స్పందించిన ఆమె.. క్షమించండి అందరూ అడుగుతున్నారు.. కానీ లైంగిక వేధింపుల వీడియోను నేను చిత్రీకరించలేకపోయాను.. అని వ్యంగ్యంగా సమాదానం ఇచ్చారు చిన్మయి. వేధింపులు అనేవి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరికైనా తప్పవు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో రక్షణ అవసరమని చిన్మయి పేర్కొన్నారు.
#MeToo అంటూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల విషయంపై రచ్చ జరుగుతున్న సమయంలో ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తు పై చిన్మయి చేసిన ఆరోపణలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా చిన్మయి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.