కర్ణాటకలో ‘హంపి మహోత్సవ్’ ని పురస్కరించుకుని ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ హంపిలో సంగీత ప్రదర్శన ఇస్తుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి బాటిల్ విసిరాడు. కన్నడ పాటలు పాడనందుకు నిరసనగా ఆ వ్యక్తి ఆయనపై బాటిల్ విసిరాడు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. హఠాత్సంఘటనతో షాక్ తిన్న కైలాష్ ఖేర్ కొద్దిసేపు తన పర్ఫామెన్స్ ఆపేశారు. కొద్దిసేపటి అనంతరం తన కాన్సర్ట్ కొనసాగించారు.
దాడికి పాల్పడిన ఇద్దరిపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. ప్రముఖ గాయకునికి భద్రత లేకుండా పోయిందనడానికి ఈ దాడి నిదర్శనమని ఖేర్ అభిమానులు ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. దుండగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇటీవల బళ్లారిలో సింగర్ మంగ్లీ కారుపై కొందరు రాళ్లు విసిరి దాడికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. కన్నడ పాటలు పాడనందుకు ఆమెపై కూడా ఈ ఎటాక్ జరిగినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో భాషాభిమానం పెరిగిపోతోందనడానికి ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయని అంటున్నారు.
బళ్లారి లో తెలుగువారు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున ఆమె తెలుగులోనే మాట్లాడారని, కానీ ఆ కార్యక్రమానికి కన్నడిగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని ఈ వార్తలు పేర్కొన్నాయి. అయితే తనకారుపై ఎవరూ రాళ్లు విసరలేదని మంగ్లీ ఆ తరువాత వివరణ ఇచ్చారు.