బెంగుళూరు లోని తన ఫామ్ హౌస్ ని కబ్జా చేస్తున్నారని సింగర్ లక్కీ అలీ ఆరోపించారు. గత 50 ఏళ్లుగా ఈ స్థలంలో తాను ఉంటున్నానని, కానీ ఓ ఐఏఎస్ అధికారితో కుమ్మక్కయి కొందరు అక్రమంగా దీన్ని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని ఆయన నగర డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ఐఏఎస్ అధికారిణి అయిన తన భార్య రోహిణి సింధూరితో కలిసి ఇందుకు యత్నిస్తున్నారని ఆయన అన్నారు.
లక్కీ అలీ తండ్రి దివంగత ప్రముఖ హిందీ కమెడియన్ మెహమూద్ అలీ.. 1969 లో ఆయన బెంగుళూరులో ఈ ఫామ్ హౌస్ ని కొనుగోలు చేశారని తెలుస్తోంది. తన అసలు పేరు మక్సూద్ మహమూద్ అలీ అని, సింగర్ అయిన తనను లక్కీ అలీ అని కూడా వ్యవహరిస్తుంటారని ఈయన తన ఫిర్యాదులో తెలిపారు.
‘కొన్ని పనుల వల్ల నేను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాను.. అయితే బెంగుళూరులోని నా ఫామ్ హౌస్ మీద కొందరి కన్ను పడిందని తెలుసుకున్నాను. బెంగుళూరు ల్యాండ్ మాఫియాలోని సుధీర్ రెడ్డి, మధు రెడ్డి వంటి వారు దీన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు.. ఐఏఎస్ అధికారి అయిన తన భార్య రోహిణి సింధూరితో కలిసి సుధీర్ రెడ్డి ఈ కబ్జాకు పాల్పడుతున్నారు’ అని లక్కీ అలీ ఆరోపించారు.
వీరు బలవంతంగా తన ఫామ్ హౌస్ లోకి చొరబడుతున్నారని, ఇదేమని అడిగితే సంబంధిత డాక్యుమెంట్లను చూపడానికి నిరాకరిస్తున్నారని ఆయన తెలిపారు. దుబాయ్ కి వెళ్లే ముందు నేను మిమ్మల్ని కలిసేందుకు ప్రయత్నించానని, కానీ మీరు అందుబాటులో లేరని అన్నారు. స్థానిక పోలీసుల నుంచి తనకెలాంటి సహకారం లభించడం లేదన్నారు. వారు కూడా కబ్జాదారులకే సహకరిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ఈ ఆస్తికి సంబంధించి కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 7 న విచారణ జరగనుందని లక్కీ అలీ తెలిపారు.