టాలీవుడ్ ప్రముఖ గాయని మంగ్లీపై దాడి జరిగిందనే వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. కర్నాటకలోని బళ్లారిలో ఆమెపై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఐతే ఈ వార్తలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తనపై దాడి జరిగిందన్న వార్తల్లో నిజం లేదని.. అది ఫేక్ న్యూస్ అని మంగ్లీ కొట్టిపారేశారు.
దీనిపై ఫేస్‌బుక్, ఇన్‌స్టగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తన ఫాలోవర్స్‌కి విజ్ఞప్తి చేశారు. శనివారం బళ్లారిలో జరిగిన కార్యక్రమంగా అద్భుతంగా విజయవంతంమైందని మంగ్లీ తెలిపారు. ప్రోగ్రామ్ ఎంత బాగా జరిగిందో ఫొటోలు, వీడియోలను చూస్తేనే అర్ధమవుతోందని చెప్పారు. కన్నడ ప్రజలను తనపై చూపిన ప్రేమను మరవలేనని ఆమె పేర్కొన్నారు.
తనను ఈవెంట్ నిర్వాహకులు, అధికారులు ఎంతో బాగా చూసుకున్నారని… దానిని మాటల్లో చెప్పలేనని అన్నారు మంగ్లీ. తన పేరు ప్రఖ్యాతులను చూసి ఓర్వలేకే.. కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవదని కోరారు.
కాగా, శనివారం బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో సింగర్ మంగ్లీ పాల్గొన్నారు. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
బళ్లారి ఉత్సవ కార్యక్రమంలో సింగర్ మంగ్లీ స్టేజ్ పై పాటలు పాడింది.
తిరిగి వెళ్లేటప్పుడు ఆమెను చూసేందుకు స్థానిక యువకులు ముందుకొచ్చారని… ఈ క్రమంలోనే మంగ్లీ కారుపై రాళ్లతో దాడి చేశారని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని మంగ్లీ క్లారిటీ ఇచ్చారు.కొన్ని రోజుల క్రితం కర్నాటకలోని చిక్కబళ్లాపుర్ లోనూ జరిగిన ఓ కార్యక్రమంలో కూడా మంగ్లీ పాల్గొన్నారు.
అయితే ఆ సమయంలో కన్నడలో మాట్లాడాలని మంగ్లీని ప్రముఖ యాంకర్ అనుశ్రీ కోరారు. అందరికీ తెలుగు వస్తుందని మంగ్లీ మాట్లాడలేదు. యాంకర్ బలవంతం చేయగా కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడింది. కన్నడలో ఎందుకు మాట్లాడలేదని ఆమెపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.