ఎస్వీబీసీ సలహాదారుగా సింగర్ మంగ్లీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పదవిపై వివాదం రాజుకుంది. అసలు ఏమాత్రం అవగాహన, అనుభవం, అర్హత లేని మంగ్లీని టీటీడీ భక్తి చానల్ కి అడ్వైజర్ గా తీసుకోవడంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. మంగ్లీ నియామకం వల్ల చానల్ కు కొత్తగా చేకూరే ప్రయోజనం ఏంటని భక్తులతో పాటు పలువురు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఎస్వీబీసీ సలహాదారు పదవిలో మంగ్లీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇందుకు మంగ్లీకి నెలకి లక్ష రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం జీతం చెల్లించనుంది. అయితే ఆమె ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే.. నెల నెలా ఆమె అకౌంట్లో జీతం పడుతోంది. ఇప్పటికే మంగ్లీ అకౌంట్లో ఏడు నెలల జీతాన్ని ప్రభుత్వం చెల్లించింది.
దీంతో పదవీ బాధ్యతలు తీసుకోకుండా జీతం ఎలా చెల్లిస్తారంటూ ప్రతిపక్షాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్తా పలు చర్చలకు తావునిస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వనియోగానికి పాల్పడుతోందని, టీడీపీ, జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
అయితే గత ఎన్నికల్లో మంగ్లీ వైసీపీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నిర్వహించిన ఎన్నికల సభల్లో మంగ్లీ తన ఆటపాటలతో ఓటర్లను ఆకట్టుకుంది. ఇందుకు సీఎం జగన్ అర్హత లేకున్నా మంగ్లీకి ఈ పదవి కట్టబెట్టారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తక్షణమే మంగ్లీని ఈ పదవి నుంచి తప్పించి.. అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.