కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులను తిరస్కరిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పటీకే పద్మభూషణ్‌ను పశ్చిమ్ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించగా.. ఇప్పుడు ఆ జాబితాలో ప్రముఖ బెంగాలీ సింగర్ సంధ్యా ముఖర్జీ కూడా చేరారు. కేంద్రం తనకి ప్రకటించిన పద్మశ్రీ అవార్డుని ఆమె తిరస్కరించింది. పద్మశ్రీ అవార్డు జూనియర్ ఆర్టిస్ట్‌కు సరిపోయే అవార్డు అని.. తన స్థాయికి అది సరిపోదని అన్నారు.
పద్మశ్రీ అవార్డు తీసుకోడానికి తను సిద్ధంగా లేనని ఉన్నతాధికారులకు ఫోన్ చేసి తన తల్లి చెప్పారని సంధ్య ముఖర్జీ కుమార్తె సౌమి సేన్‌గుప్తా తెలిపారు. 90 ఏళ్ల వయసులో పద్మశ్రీకి ఎంపికచేయడం ఆమె అవమానంగా భావించారని అన్నారు. పద్మశ్రీ జాబితాలో ఆమె పేరు పెడతామని కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి సంప్రదింపులు వచ్చినపుడే ఆమె ఈ విధంగా స్పందించారని సౌమి సేన్‌గుప్తా చెప్పారు.
పద్మశ్రీ దేశంలో నాలుగో అత్యున్నత పురస్కారమని.. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ స్థానమని ముఖర్జీ కుటుంబసభ్యులు చెబుతున్నారు. పద్మశ్రీ ఓ జూనియర్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ కానీ.. గీతాశ్రీ సంధ్య ముఖోపాధ్యాయ్‌కు కాదని.. ఆమె కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కరాన్ని బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కూడా తిరస్కరించారు. ఈ అవార్డుపై ఇంతవరకూ తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం నిజంగా తనకు పద్మ అవార్డు ఇవ్వాలని నిర్ణయించి ఉంటే.. దానిని తాను వెనక్కి ఇచ్చేస్తానని భట్టాచార్య తెలిపారు. పద్మ అవార్డులను గతంలో ప్రముఖ గాయని ఎస్.జానకి, బాలీవుడ్ సినీ రచయిత సలీం ఖాన్‌లకు తిరస్కరించారు. అలాగే, ప్రముఖ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ తనకు 1974లో ప్రకటించిన అవార్డును 1984 స్వర్ణ దేవాలయం ఘటనకు నిరసనగా 2005లో తిరిగిచ్చారు.