సంక్రాంతి తర్వాత శివరాత్రికే గట్టి పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. సమంత నటించిన శాకుంతలం, ధనుష్ సార్ సినిమాలు పోటీ పడతాయని, మధ్యలో పించ్ హిట్టర్ గా కిరణ్ అబ్బవరం సినిమా కూడా వస్తుందని లెక్కలు కట్టారు. అయితే ఇప్పుడు అందరూ తప్పుకున్నారు. సర్ కు దారిచ్చారు.
అవును.. ఈ శుక్రవారం ధనుష్ సినిమా సార్ కు సోలో రిలీజ్ దక్కింది. ఈ మేరకు నిర్మాతలంతా కూర్చొని మాట్లాడుకున్నారు. నిర్మాత నాగవంశీకి సోలో రిలీజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దిల్ రాజు ఆల్రెడీ తప్పుకున్న సంగతి తెలిసిందే. శాకుంతలం సినిమాను ఏకంగా ఫిబ్రవరి నుంచి తప్పించేశారు.
తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ సినిమాను కూడా ఒక రోజు వాయిదా వేశారు. 17న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా, 18న థియేటర్లలోకి వస్తోంది. ఇక సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్ బాబు చిత్రాన్ని కూడా 17న కాకుండా.. 18న విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇలా శివరాత్రికి బాక్సాఫీస్ బరిలో అనవసర పోటీ లేకుండా అంతా ముందే మాట్లాడుకొని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే శివరాత్రి కాబట్టి సరిపోయింది, ప్రతిసారి ఇలా జరక్కపోవచ్చు.