తమిళ స్టార్ హీరో ధనుష్ తొలిసారి తెలుగులో నటిస్తున్న సినిమా ‘సార్’. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక నేడు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ‘సార్’ చిత్రం నుండి టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ధనుష్ తొలిసారి స్ట్రెయిట్ తెలుగు మూవీతో వస్తుండటంతో టాలీవుడ్ వర్గాల్లో సార్ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ వస్తున్నాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ అద్భుతంగా కట్ చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్‌లోనే సినిమా కథ ఏమిటో మనకు చెప్పేసింది చిత్ర యూనిట్.
కార్పొరేట్ విద్యా వ్యవస్థ నిరుపేదలకు చదువును ఎలా దూరం చేస్తుందనే అంశంపై ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.‘‘జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్’’ అంటూ ప్రస్తుత విద్యా వ్యవస్థ గురించి ఒక్కమాటలో చెప్పేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి.
ఈ సినిమాను క్లాస్, మాస్ ప్రేక్షకులు మెచ్చేలా అన్ని అంశాలతో తెరకెక్కిస్తోంది సార్ చిత్ర యూనిట్. ఇక ‘బాల గంగాధర్ తిలక్’ అనే పవర్‌ఫుల్ పేరు హీరోకు ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు ధనుష్. సరికొత్త మేకోవర్‌తో ధనుష్ లుక్ ఈ సినిమాలో అద్భుతంగా ఉండటంతో, మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ సక్సెస్ అందుకునేందుకు ఈ హీరో రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నాగవంశీ, సౌజన్యలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.