తెలంగాణ ఉద్యమకారులంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే కాదు.. ఆయన తనయుడు కేటీఆర్‌కు కూడా చులకనైపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం కోసం పోరాడిన వారికి కనీస గౌరవం ఇవ్వాలనే ఆలోచన తండ్రీకొడుకులకు లేదని అనేక మార్లు, అనేక మంది ఇప్పటికే తప్పుబట్టారు..ఇంకా తప్పుబడుతూనే ఉన్నారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన అపవాదు ఇప్పటికే కేసీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నా.. మహనీయుల పట్ల వారి తీరు మారడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి సిరిసిల్లలో అవమానం జరుగుతోంది. మూడేళ్ల క్రితం విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్.. ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని సిరిసిల్లవాసులు ఆరోపిస్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహం చేయించి కూడా మూడేళ్లవుతున్నా.. దాన్ని ప్రతిష్టించేందుకు కేటీఆర్‌కు తీరికే దొరకడం లేదని విమర్శిస్తున్నారు. అధికారులను అడిగితే కేటీఆర్ అనుమతి కావాలంటున్నారని, అప్పటిదాకా దాన్ని అలాగే పక్కకుబెట్టాలని చెప్తున్నారని వాపోతున్నారు. మరోవైపు కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్దామంటే.. ఆయన ఎప్పుడు వస్తున్నారో.. వెళ్తున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.