తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం.. ఇక వాటికి మహర్దశే.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ గొప్పలు చెప్పుకుంటారు. స్వయం పాలనతో గిరిజనులు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నారంటూ డబ్బా కొడుతుంటారు. కానీ రాష్ట్రంలో తండాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పేరుకు పంచాయతీలుగా మారాయే కానీ.. చాలా తండాల్లో పాత సమస్యలే తాండవిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తండాల దుస్థితిని చూస్తే.. సర్కార్ మాటల్లోని డొల్లతనమేంటో కళ్లకు కడుతుంది.
వర్షాకాలం వస్తే చాలు అక్కడి ఐదు తండాలకు నరకమే. జూన్ నుంచి అక్టోబర్ వరకు బహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి.. ఆ తండావాసులు బతికున్నారో కూడా తెలియదు. ఇందుకు కారణం మొండివాగు. ఏటా వర్షాకాలంలో ఈ వాగు ఉధృతంగా పొంగి.. సర్పంచ్ తండా, వెనుక తండా, గోప్య తండా, గంట తండా, బుగ్గ తండాకు రాకపోకలు నిలిచిపోతుంటాయి. ఇందులో సర్పంచ్ తండా, గోప్యతండా గ్రామపంచాయతీలు కూడా. కానీ దశాబ్ధాల తరబడి వారిని ఇదే సమస్య వేధిస్తోంది. గత ఎన్నికల సమయంలో.. ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చి అధికార పార్టీ ఓట్లు వేయించుకుంది. అన్న ప్రకారమే సర్పంచ్ తండా వద్ద ఒకటి, వెనుక తండా వద్ద మరొకటి.. మొత్తం రెండు వంతెనలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 5.5 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. కాంట్రాక్టర్ 2019 నవంబర్‌లో పనులను కూడా ప్రారంభించాడు. కానీ ఏమైందో తెలియదు.. నాలుగు నెలలకే వదిలేశాడు. కారణం అడిగితే ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని.. పనులు చేయలేనని చేతులెత్తేశాడు. దీంతో ఆ ఐదు తండాల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
We the Tribal people of Sarpanch Thanda, Sirikonda, Nizamabad dist, 3years ago govt sanctioned 5.5crs to build bridge on this gully, still work not started, We are facing this problem from many decades, In emergency cases we don't have any option to cross this gully.@CharanT16 pic.twitter.com/LmSTZEEDr1
— Vaasu Karthik (@VaasuKarthik) August 2, 2021
Advertisements
గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు ఏదైనా అవసరం వచ్చి వాగు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు వరద ఉధృతికి కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే విషయంపై చాలాసార్లు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ జూన్ కల్లా.. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ.. ఇంతవరకు తట్ట మట్టి వేసింది లేదు.. తీసింది లేదు. అధికారులను ప్రశ్నిస్తే.. నిధులు వస్తేనే కాంట్రాక్టర్ పనులు చేస్తానని అంటున్నాడని.. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని చెప్తున్నారు. దీంతో తండావాసుల వేదన ఆరోణ్యరోదగానే మిగిలిపోతోంది.