రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన యువ చేనేత కార్మికుడు వెండి చీరను నేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్.. చేనేత చీరల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఈ మధ్యనే సిరి చందనం పట్టుగా సిరిసిల్ల చీరలకు పేరు రావడానికి విజయ్ కూడా ఓ కారణం.
ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తూ.. చేనేతకే అందం తెచ్చేలా వెండి చీరను మగ్గంపై నేశాడు. గతంలో ఎన్నో ప్రయోగాలు చేసిన విజయ్.. ఈ ప్రయోగంతో మరోసారి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. లేటెస్ట్ గా ఈ వెండి చీరకు 90 గ్రాముల వెండిని కలపడం జరిగిందన్నాడు.
ఈ చీర 600 గ్రాములు ఉంటుందని, ఐదున్నర మీటర్ల 48 ఇంచుల పన్నా నేయడం జరిగిందన్నారు. ఈ చీర కోసం రూ.45 వేలు వెచ్చించినట్లు విజయ్ తెలిపాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సిరి చందనం పట్టు చీరతో పూర్తిగా వెండి దారాలతో చీర కావాలని కోరారు. ఆమె కోరిక మేరకు వెండి చీరను నేశాడు. ఈ చీరను నెల పది రోజులు శ్రమించి రూపొందించడం జరిగిందని తెలిపాడు విజయ్.