విప్లవ వాద్యాలు.. విషాద నేపద్యాలు.. ఆ కలంలో ఎన్నో నీగుడార్థాలు.. నిగ్గదీసి అడిగినా.. నువ్వు నువ్వు అంటూ ప్రేమ గీతం రాసినా.. ఆయనకు ఆయనే సాటి. తెలుగు సినిమా సాహిత్యంపై సిరివెన్నెలలు కురిపించిన ఆ కలం నేటితో ఆగిపోవచ్చు. కానీ.. ఆయన రాసిన అక్షరాలు మాత్రం ఆగవు. ప్రశ్నించే ఆయుధంగా మారతాయి.. జోల పాడతాయి.. నిరంతరం ప్రేమ కురిపిస్తాయి.
విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న జన్మించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల చిత్రంతో ఆ పేరునే ఇంటి పేరుగా మార్చేసుకున్నారు.
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ చదివారు సిరివెన్నెల. మొదట్లో భరణి అనే పేరుతో కవితలు రాసేవారు. ఆయన రాసిన గంగావతరణం అనే కవిత చూసి విశ్వనాథ్.. సిరివెన్నెల సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. తన కెరీర్‌లో 3 వేలకు పైగా పాటలు రాశారు సీతారామశాస్త్రి. 2019లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఇక తన సినీ జీవితంలో 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు.