ఆ కలంలో ఎన్నో నీగుడార్థాలు.. నిగ్గదీసి అడిగినా.. నువ్వు నువ్వు అంటూ ప్రేమ గీతం రాసినా.. ఆయనకు ఆయనే సాటి. తెలుగు సినిమా సాహిత్యంపై సిరివెన్నెలలు కురిపించిన ఆ కలం ఇప్పుడు ఆగిపోవచ్చు. కానీ.. ఆయన రాసిన అక్షరాలు మాత్రం ఆగవు. ప్రశ్నించే ఆయుధంగా మారతాయి.. జోల పాడతాయి.. నిరంతరం ప్రేమ కురిపిస్తాయి. అందుకే భౌతికంగా సిరివెన్నెల మనకు దూరమైనా.. తెలుగు సాహిత్య లోగిళ్లలో ఆయనది చెరగని ముద్ర.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం 4.07 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతతో ఈనెల 24న సికింద్రాబాద్ కిమ్స్ లో చేరారు సిరివెన్నెల. ఐసీయూలో ఉంచి ఆయనకు వైద్యం అందిస్తూ వచ్చారు డాక్టర్లు. అయితే ఆరోగ్యం క్షీణించి ఆయన చనిపోయారు.
సిరివెన్నెల ఆరేళ్ల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలిపారు కిమ్స్ ఎండీ భాస్కర్ రావు. ఈ క్రమంలోనే ఆయన సగం ఊపిరితిత్తి తీసేసినట్లు చెప్పారు. ఐదు రోజుల నుండి ఎక్మా మిషన్ మీద ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితి విషమించిందన్నారు. చికిత్స చేస్తుండగా సిరివెన్నెల కన్నుమూసినట్లు తెలిపారు భాస్కర్ రావు.
Advertisements
సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, నటులు చిరంజీవి సహా ఇతర ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.