రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన స్థలాన్ని సిర్పుర్కర్ కమిషన్ బృందం పరిశీలించింది. అలాగే దిశ మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని చూశారు సభ్యులు. వీటితోపాటు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.
అయితే షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను కమిషన్ సభ్యులు సందర్శిస్తున్న సమయంలో కొందరు స్థానికులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. స్టేషన్ ముందు బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కిరాతకులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై కమిషన్ ఎందుకంటూ నిలదీశారు. స్టేషన్ ముందు వారి నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ బందోబస్తు నడుమ కమిషన్ పర్యటన జరిగింది.
ఆగస్టు 21న సిర్పుర్కర్ కమిషన్ విచారణ ప్రారంభమైంది. నవంబర్ 25 వరకు కొనసాగింది. హోంశాఖ కార్యదర్శి రవిగుప్తతో విచారణ మొదలు పెట్టిన సభ్యులు తర్వాత సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. మహేశ్ భగవత్, సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను ప్రశ్నించారు. మృతుల కుటుంబసభ్యుల నుంచి వివరాలు తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.