చిన్నప్పుడే పెద్ద హిట్ ఇచ్చిన అఖిల్‌కి పెద్దయ్యాక ఒక మంచి హిట్ కూడా లేదేంటా అని అక్కినేని ఫాన్స్ తెగ ఫీలయిపోతుంటారు !! ఇదే కింగ్ నాగార్జునకు కూడా తీరని బాధగా వుండిపోయింది. పెద్దాడు నాగచైతన్యకు సొంత ముద్ర అంటూ పడింది. అఖిల్ కూడా ఓ ఒడ్డునపడితే అంతకంటే ఆ తండ్రికి కూడా కావాల్సిందేముంది అంటుంటారు నాగ్ అభిమానులు.
అన్నపూర్ణ స్డూడియోస్ పతాకంపై నటుడు నాగార్జున నిర్మించిన సిసింద్రీ చిత్రం 1995 సెప్టెంబరు 14న విడుదలైంది. కింగ్ నాగార్జునకు పుత్రోత్సాహం తెచ్చింది. అందులో నాగార్జున కూడా ‘ఆటాడుకుందాం..రా..అందగాడా..’ అంటూ ఓ సాంగ్‌లో ఆడి ఆకట్టుకున్నాడు. తర్వాత చదువుల్లో పడిన అఖిల్ 2014లో అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం’లో చివర్లో కథను మలుపు తిప్పే చిన్న రోల్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ఇంకేముంది.. కృష్ణకి మహేశ్‌బాబులా నాగార్జునకి అఖిల్ వచ్చేశాడని అందరూ అనుకున్నారు.
తర్వాత పూర్తి స్థాయి హీరోగా 2015లో తన పేరుతోనే వచ్చిన మూవీతో హీరోగా తెరంగేట్రం చేశాడు అఖిల్. ఆ మూవీ నిరాశపరచింది. 2017లో వచ్చిన హలో, 2019లో మిస్టర్ మజ్నూ కూడా హిట్ కొట్టలేకపోయాయి.
ప్రస్తుతం అఖిల్‌తో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా2 పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. కథానాయికగా గోల్డెన్ లెగ్ పూజా హేగ్డేను ఖరారు చేశారు.
ఈ మూవీతో నైనా బిగ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ గంపెడాశతో ఉన్నారు. కింగ్ నాగార్జున, యంగ్ కింగ్ నాగ చైతన్య కెరీర్ తొలినాళ్ళలో ఆటుపోట్లు ఎదుర్కొన్నా తర్వాత రాటుదేలారు. అక్కినేని నట వారసత్వంలో శభాష్ అనిపించారు. గతంలో శివ హిట్ పెయిర్ అమల, నాగార్జున ముద్దుల తనయుడు ఇద్దరి వారసత్వ ప్రతిభ నిలబెడతాడని ఫ్యాన్స్ ఆశ..!