లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ ఆప్ సోమవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. 2021-22 సంవత్సరానికి రూపొందించిన ఎక్సయిజు పాలసీకి సంబంధించి అనేక అంశాలపై సీబీఐ నిన్న ఆయనను 8 గంటలకు పైగా ప్రశ్నించింది.
అయితే తానేమీ అవినీతికి పాల్పడలేదని సిసోడియా సిబిఐ అధికారులకు తేల్చి చెప్పారు. తమ నేత అరెస్టు నిరసిస్తూ ఆప్ భారీ ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ సహా అనేక చోట్ల పోలీసులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.
సిసోడియాను సిబిఐ మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరు పరచవచ్చునని తెలుస్తోంది. ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని అధికారులు.. కోర్టును కోరవచ్చు.
తాము అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సరిగా సమాధానాలు చెప్ప లేదని , తమ విచారణకు సహకరించలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియాను, ఆప్ నేత సత్యేందర్ జైన్ ను కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ నేత కపిల్ మిశ్రా డిమాండ్ చేశారు.