లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కస్టడీని రౌజ్ ఎవెన్యూ కోర్టు మరో 5 రోజులు పొడిగించింది. ఆయన రిమాండును ఇంకా 7 రోజులు పొడిగించాలని ఈడీ మొదట కోర్టును కోరింది. ఈ కేసులో ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టవలసి ఉందని పేర్కొంది. ఆయన ‘క్లౌడ్ డేటా’ ను తాము రిట్రీవ్ చేశామని, ఇందులో 1.23 లక్షల ఈ-మెయిల్ డంప్స్ ఉన్నాయని ఈ డేటాను ఫోరెన్సిక్ విభాగానికి పంపి ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉందని వివరించింది. లిక్కర్ కేసుకు సంబంధించిన సమాచారం ఉన్న తన పాత ఫోన్ ను సిసోడియా నాశనం చేశారని ఈడీ అధికారులు తెలిపారు.
ఈ కేసులో ఇతర నిందితులతో బాటు ఆయనను విచారించవలసి ఉందని వారన్నారు.ఇక . తన క్లయింట్ కస్టడీని పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తిని సిసోడియా తరఫు లాయర్ వ్యతిరేకించారు. సిసోడియాను ఇప్పటికే అనేకసార్లు విచారించారని, ఆయన ఏ సమాచారాన్నీ దాచలేదని అన్నారు. మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియాను ఈ నెల 9 న ఈడీ ఆరెస్టు చేసింది
ఎక్సయిజు పాలసీ కేసుపై ఫిర్యాదు రాగానే జులై 22 న తన మొబైల్ ఫోన్ ని ఆయన మార్చివేశారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. . ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయనపై సిబిఐ కొత్త కేసు పెట్టింది. తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఫీడ్ బ్యాక్ యూనిట్ ను వినియోగించుకుంటున్నారని ఆరోపించింది.
సిసోడియా బంగ్లా అతిషికి కేటాయింపు
ఢిల్లీ ప్రభుత్వం సిసోడియా అధికార నివాసాన్ని కొత్త మంత్రి అతిషికి కేటాయించింది. ఆమె విద్యాశాఖతో బాటు పబ్లిక్ వర్క్స్, కల్చర్, టూరిజం శాఖలను పర్యవేక్షిస్తున్నారు.