ఢిల్లీ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్టయి రాజీనామాలు చేయగా ..వారి స్థానే ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ గురువారం మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరికి దాదాపు సిసోడియా, జైన్ నిర్వహించిన పోర్టుఫోలియోలనే అప్పగించారు. అయితే సిసోడియా, జైన్ ఇద్దరూ బయటకు వచ్చిన అనంతరం తిరిగి మంత్రులుగా వారి వారి శాఖలను నిర్వహిస్తారని కొత్త మంత్రి అతిషి వ్యాఖ్యానించారు.
రాముడు ప్రవాసానికి (అరణ్యానికి) వెళ్లిన తరువాత ఆయన తమ్ముడు భరతుడు తాత్కాలికంగా రాజ్యాన్ని ఎలా పాలించాడో అలా తాము కూడా ఈ శాఖలను నిర్వహిస్తామని ఆమె అన్నారు. సిసోడియా, జైన్ ఇద్దరూ విద్యా, ఆరోగ్య రంగాలకు చరిత్రాత్మక సేవలందించారని, వీరు జైలు నుంచి విడుదలైన అనంతరం తమ మంత్రిత్వ శాఖలను తిరిగి చేపడతారని ఆమె చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం ఇబ్బందుల పాల్జేస్తోందని . . చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని ఆమె ఆరోపించారు.
సిసోడియా మళ్ళీ అరెస్ట్
తీహార్ జైల్లో ఉన్న మనీష్ సిసోడియాను ఈడీ మళ్ళీ గురువారం అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఉదయం దాదాపు 45 నిముషాల పాటు ఆయనను ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ కోర్టు ఈ నెల 10 న తీర్పునివ్వనుంది. మనీ లాండరింగ్ నివారణ చట్టం లోని సెక్షన్ 19 కింద అనుమానితులను అరెస్టు చేసే అధికారం ఈడీకి ఉంది.