ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్య సభ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా హక్కుల కోసం ఆమె ఢిల్లీలో ఈ నెల 10న దీక్ష చేస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆమెకు ఈడీ ఈ రోజు నోటీసులు పంపించిందన్నారు.
విపక్షాలను వేధించాలనే ఉద్దేశంతోనే కవితకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రశ్నించిన వారి పట్ల బీజేపీ పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. విపక్షాలను లేకుండా చేసేలా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లును ఆమోదించుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో ఈడీ, సీబీఐకి నిధులు పెంచడన్నారు. గల్లీగల్లీకి బ్రాంచ్ ఓపెన్ చేసి విపక్షాలను అరెస్ట్ చేయండంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శవాలను కూడా విచారించేలాగా కొత్త నియమాలను తీసుకురండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న ఆప్ ముఖ్య నేత మనీశ్ సిసోడియా భద్రత విషయంలో ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత ప్రమాదకరమైన నేరస్తులను ఉంచే తిహార్ జైలుకు సిసోడియాను పంపడంతో ఆయన భద్రతపై ఆందోళన కలుగుతోందన్నారు.
మొదటిసారి ఖైదీని ఎవరినైనా అలాంటి నేరస్తుల మధ్య గతంలో ఎప్పుడైనా ఉంచారా? అని ఆయన ప్రశ్నించారు. విచారణలో ఖైదీని తీహార్ జైలు ఒకటో సెల్ కు పంపించడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. సిసోడియాను ఒకటో నంబర్ సెల్‌లో ప్రమాదకర నేరస్తుల మధ్య ఉంచినట్టు ఆరోపించారు.
ఎన్నో మర్డర్లు చేసిన వారు అక్కడ ఉన్నారన్నారు. కొందరు మానసికంగానూ దృఢంగా లేరన్నారు. మనీశ్ సిసోడియాను విపాసన సెల్‌లో ఉంచాలని న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వున్నాయన్నారు. అక్కడ అయితే సిసోడియా మెడిటేషన్ చేసుకోగలరన్నారు. తాము రాజకీయ ప్రత్యర్థులమనీ. కానీ, కేంద్రం ఇప్పుడు రాజకీయ హత్యలకు పాల్పడుతోందా? అని ఆయన ప్రశ్నించారు.