హిట్ అండ్ రన్ కేసులో హతురాలు అంజలీ సింగ్ కుటుంబాన్ని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బుధవారం పరామర్శించారు. ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రూ. 10 లక్షల పరిహారాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అవసరమైతే ఈ కుటుంబానికి ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నగరంలో శాంతి భద్రతలను అదుపు చేసే బదులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్షాలను అణగదొక్కేందుకు యత్నిస్తోందని సిసోడియా ఆరోపించారు. అంజలికి న్యాయం జరగాలని బుధవారం కూడా ఆప్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు నగర పోలీస్ కమిషనర్ ని కలిసి.. ఈ ఘటన జరిగిన రోజున పోలీసుల వైఫల్యాన్ని ఆయన దృష్టికి తెచ్చారు.
ఈ కేసులో అయిదుగురు నిందితుల కారు అంజలీ సింగ్ ని ఈడ్చుకుంటూ నాలుగు పోలీసు స్టేషన్లను దాటివెళ్లినట్టు వచ్చిన వార్తలను వారు ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించి ఔటర్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ హరేంద్ర సింగ్ ను తొలగించాలన్న కోర్కెతో సహా ప్రధానంగా 5 డిమాండ్లతో కూడిన మెమోరాండం ను ఆయనకు సమర్పించారు.
ఈ నేరం జరిగిన పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న పోలీసు అధికారులనందరినీ డిస్మిస్ చేయాలని ఆప్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ కోరారు. పైగా ఈ సంఘటనపై ఐపీసీలోని చిన్న పాటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పట్టుబడిన అయిదుగురు నిందితుల్లో ఒకడు బీజేపీకి చెందినవాడని, అందువల్లే పోలీసులు ఈ కేసును ఆషామాషీగా పరిగణిస్తున్నారని, నామ మాత్రపు చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు.