లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ కోరుతూ శుక్రవారం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఆయన ఇదే విషయమై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది. మొదట మీ అభ్యర్థనను దిగువ కోర్టుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించింది. ఇలాంటి విషయాల్లో మొదట్లోనే తాము జోక్యం చేసుకోజాలమని, మీ పాయింట్లన్నీ హైకోర్టుకు విన్నవించుకోవాలని ఆయనకు సలహా ఇచ్చింది.
ఈ కేసులో సిబిఐ ఆయనను అరెస్టు చేసిన అనంతరం సిసోడియా పదవికి రాజీనామా చేశారు. 5 రోజుల పాటు ఆయనను సిబిఐ కస్టడీకి పంపుతూ ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు ఇటీవల ఆదేశించింది. అయితే తమ నేతలిద్దరిపైన బీజేపీ కక్ష సాధిస్తోందని ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు.
ఇండియాకు మంచి పేరు తెచ్చిపెట్టిన వీరిద్దరినీ ప్రధాని మోడీ జైలుకు పంపారని, ఎక్సయిజు పాలసీ అన్నది సాకు మాత్రమేనని ఆయన అన్నారు. అసలు స్కామ్ వంటిదేదీ జరగలేదని, విద్యా రంగంలో సిసోడియా చేసిన మంచి పనులకు ఆయనను అరెస్టు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
అలాగే మరో నేత సత్యేంద్ర జైన్ విషయంలో కూడా బీజేపీ కక్ష తీర్చుకుందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ సిసోడియా తోసిపుచ్చారు. ఈ ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకే భారతీయ జనతా పార్టీ కేసుల పేరిట వేధిస్తోందన్నారు.