ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టు సిబిఐ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఉత్తర్వులను రిజర్వ్ లో ఉంచింది. ఈ నెల 10 న మధ్యాహ్నం 2 గంటలకు దీన్ని విచారణకు స్వీకరిస్తామని రౌజ్ రెవెన్యూ కోర్టు జడ్జి ప్రకటించారు.
ఆయన కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలని సిబిఐ కోరింది. అయితే కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. తన క్లయింట్ ..రిమాండ్ పొడిగింపు న్యాయసమ్మతం కాదని సిసోడియా తరఫు లాయర్ పేర్కొన్నారు. . విచారణకు తమ క్లయింట్ సహకరించడం లేదని సిబిఐ అధికారులు చేసిన ఆరోపణను కూడా ఆయన తోసిపుచ్చారు.
సిసోడియాను అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని ఆయన అన్నారు. పైగా తన క్లయింట్ భార్య ఆరోగ్య పరిస్థితి కూడా బాగు లేదన్నవిషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.
ఇరు పక్షాల వాదనలు ఆలకించిన కోర్టు.. సిసోడియా బెయిల్ పిటిషన్ పై మార్చి 10 న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.