ఓ వైపు నుంచి విచారణకు రావాలని నోటీసులు వస్తుంటే.. మరో వైపు నుంచి సమాధానంగా లేఖలు వెళుతున్నాయి. ఇది సిట్ ఇంకా టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య నెలకొన్న పరిస్థితి. ఈ రోజు తప్పనిసరిగా ఆధారాలతో వ్యక్తిగతంగా విచారణకు రావాలని సిట్ అధికారులు నిన్న నోటీసులు ఇస్తే.. బండి మళ్లీ లేఖాస్త్రాన్ని సంధిస్తూ సిట్ కు షాక్ ఇచ్చారు.
పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న క్రమంలో తాను విచారణకు హాజరు కాలేనని, దీంతో పాటు ఈ కేసును విచారిస్తున్న సిట్ పై తనకు ఎలాంటి నమ్మకం లేదని మరో సారి లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు.. కేసులో అరెస్టులు జరుగుతన్న క్రమంలో తన దగ్గరున్న ఆధారాలను బహిర్గతం చేయడం ఏమాత్రం సరికాదని.. అందుకు తాను తన దగ్గరున్న ఆధారాలను కూడా సిట్ అధికారుల ముందు పెట్టలేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఇక అసలు విషయంపై విచారణ చేయకుండా తనకు నోటీసుల పై నోటీసులు ఇవ్వడం ఏంటని ఆయన మండి పడ్డారు. అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై విచారణ చేపట్టిన సిట్.. పేపర్ లీకేజీ విషయంలో ఆరోపణలు చేసిన వారికి ఆధారాలు చూపించాలంటూ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఈనెల 24 న హాజరు కావాలని ముందుగా బండి సంజయ్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే తనకు ఎలాంటి నోటీసులు అందలేదని.. అధికారులు నోటీసులు ఏ ఇంటికి అతికించారో.. తనకు తెలియదని.. తాను ఇంటికి వెళ్లి చూస్తే మాత్రం చిరిగిపోయిన కాగితం గోడకు అతుక్కొని ఉందని అన్నారు.
అయితే పార్లమెంట్ సమావేశాలు నడుసున్న నేపథ్యంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా వాటికి హాజరు కావల్సి ఉందని.. ఈ కారణంగా సిట్ ముందు హాజరు కాలేనని బండి లేఖ ద్వారా వెల్లడించారు. దీంతో నిన్న మరోసారి సిట్ అధికారులు ఈ రోజు హాజరు కావాలని నోటీసులు స్వయంగా బండి చేతికి ఇవ్వడం జరిగింది. అయితే రెండో సారి కూడా బండి లేఖ ద్వారా సిట్ అధికారులకు తాను రాలేనని స్పష్టం చేశారు.
ఇది ఇలా ఉంటే..రేవంత రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కాని ఆయన చేసిన ఆరోపణలకు అనుగుణంగా ఆధారాలను చూపించలేకపోయారని సిట్ అధికారులు వెల్లడించారు. అయితే కేసు విచారణ చేయకుండా.. నోటీసులతో భయపెడుతున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. సిట్ పై అసలు నమ్మకమే లేదని.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
అయితే.. రెండో సారి కూడా సిట్ కు బండి సంజయ్ రాలేనని లేఖ రాయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి దీనిపై సిట్ అధికారులు ఏవిధంగా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.