తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య 50కి చేరే అవకాశం ఉంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఈ కేసులో 37 మంది అరెస్ట్ కాగా.. ఈ సంఖ్య 50కి చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు.
ఈ ఏడాది మార్చి 7-8 తేదీల్లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్ పేపర్ లీకైనట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు లీకేజీతో ప్రమేయం ఉన్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు సిట్ కు బదిలీ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిని, ఢాక్యానాయక్ ను, రేణుకను తమ స్టైల్లో విచారించిన సిట్.. దిమ్మతిరిగే విషయాలను బయటపెట్టారు. ఈ కేసులో హస్తమున్న నిందితులను అరెస్ట్ చేశారు.
కమిషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రోజుల తరబడి ప్రశ్నించి వాగ్మూలం తీసుకున్నారు. చివరి ప్రయత్నంగా కష్టసాధ్యమైన పనికి సిద్ధమయ్యారు. గ్రూప్-1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షలు రాసిన అభ్యర్థుల జవాబు పత్రాలను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో అభ్యర్థికి వచ్చిన మార్కుల ఆధారంగా జాబితాను రూపొందించారు. వారిలో మార్కులు ఎక్కువగా వచ్చిన అభ్యర్థుల ఫోన్ నెంబర్లను గుర్తించారు.
ఆ తర్వాత వారి బ్యాంక్ అకౌంట్స్ ను పరిశీలించారు. అనంతరం పలువురు అభ్యర్థులను ప్రశ్నించారు. ఈ క్రమంలో అనుమానం ఉన్న 37 మందిని నిందితులుగా గుర్తించారు సిట్ అధికారులు. అయితే ఈ సంఖ్య 50కి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మరో నలుగురిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.