మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిజానిజాలు తెలుసుకునేందుకు సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని తుషార్ కు నోటీసులు పంపింది. ఈనెల 21 లోపు విచారణకు రావాలని అధికారులు పేర్కొన్నారు.
రామచంద్ర భారతి, రోహిత్ రెడ్డితో తుషార్ మాట్లాడినట్లు సమాచారం. అతన్ని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు బయటపడతాయని సిట్ భావిస్తోంది. అందుకే నోటీసులు పంపింది. నిందితుల ఆడియో, వీడియోల్లో తుషార్ పేరు పదే పదే వినిపించడంతో ఆయనను విచారించాలని సిట్ నిర్ణయించింది. అలాగే.. కేరళకు చెందిన జెగ్గు స్వామి కోసం సిట్ వేట కొనసాగుతోంది.
ఎవరీ తుషార్.. బీజేపీతో ఉన్న సంబంధం ఏంటి?
ఎమ్మెల్యేల కొనుగోళ్లలో కీలక పాత్ర పోషించాడని భావిస్తున్న తుషార్.. గతంలో గవర్నర్ తమిళి సై దగ్గర ఏడీసీగా పనిచేశాడు. ఆ విషయాన్ని ఆమే మీడియాకు వెల్లడించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన తుషార్ కూడా అతడేనని కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు నిజంగా బీజేపీ నేత బీఎల్ సంతోష్ తో డీలింగ్స్ ఉన్నాయా? తాజాగా గవర్నర్ ను అతను కలిశాడా? ఇలా ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి. కమలనాథులు చెబుతున్న దాని ప్రకారం.. తుషార్ కు బీజేపీకి సంబంధం లేదు.
కేరళకు చెందిన తుషార్ తండ్రి పేరు నటేషన్ వెల్లపల్లి. వీళ్లకు ఒక పార్టీ కూడా ఉంది. దాని పేరు భారత ధర్మ జనసేన. ఇతను వాయనాడ్ లో రాహుల్ గాంధీపై పోటీ చేశాడు. ఆ నియోజకవర్గంలో బీజేపీకి అంత పట్టు లేదు. తుషార్ కు మద్దతు తెలిపి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, ఎలక్షన్ తర్వాత తమను ఎవరూ పట్టించుకోలేదని తుషార్ తండ్రి నటేషన్ బీజేపీపై పలు సందర్భాల్లో ఆరోపణలు చేశాడు. శబరిమల ఇష్యూలో నిరసనలకు దిగిన తుషార్ పై చెక్ బౌన్స్ కేసు కూడా ఉంది. అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాడు. 19 కోట్ల బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన తుషార్ వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను ఎలా కొంటాడు? అనే ప్రశ్న బీజేపీ సైడ్ నుంచి వినిపిస్తోంది. అయితే.. కేసులో అతని పేరు తెరపైకి రావడంతో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు ఆహ్వానం పంపారు.