TSPSC పేపర్ లీకేజీ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. తీగ లాగితే డొంక కదులుతుందన్నట్లుగా.. ఈ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తొమ్మిది మంది నిందితులను ఆరో రోజులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే.. మరో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. వారిని ప్రశ్నిస్తే.. సిట్ అధికారులను సైతం షాక్ కి గురి చేసే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్ లను రెండో సారి కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు.. వారి నుంచి పలు కీలక విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఇంకా లోతైన విచారణ సాగిస్తూ దూకుడు పెంచింది సిట్.
అందులో భాగంగానే గ్రూప్-1 ప్రిలిమ్స్ లో అధిక మార్కులు వచ్చిన వారిపై సిట్ అధికారులు దృష్టి సారించారు. 100 మార్కులకి పైన వచ్చిన వారి లిస్ట్ ను తయారు చేసుకొని.. ప్రిలిమ్స్ కు అర్హత పొందిన అభ్యర్థులకు ఫోన్లు చేస్తున్నారు. సిట్ కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులను వారి విద్యార్హతలు, ప్రస్తుతం ఏ ఉద్యోగం చేస్తున్నారనే వివరాలపై ఆరా తీశారు.
అభ్యర్థి నుంచి గతంలో రాసిన పోటీ పరీక్షల్లో వచ్చిన మార్కులను సిట్ బృందం తెలుసుకుంటుంది. అవసరమైతే మళ్లీ పిలుస్తామని గ్రూప్-1 అభ్యర్థులకు సిట్ అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. అనుమానం వచ్చిన అభ్యర్థులపై నిఘా పెంచుతున్నారు అధికారులు.