టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ స్పీడ్ పెంచుతోంది. గ్రూప్ 1 ఎగ్జామ్ లో వందకు పైగా మార్కులు వచ్చిన వంద మందిని సిట్ అధికారులు విచారించి వారి స్టేట్ మెంట్స్ ను రికార్డు చేశారు. ఇక ఇదే జాబితాలో మరో 21 మందిని కూడా రెండుమూడ్రోజుల్లో విచారించనున్నారు అధికారులు.
ఇలా ఉంటే ఇప్పటి వరకు ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిన ప్రవీణ్, రాజశేఖర్ ద్వారా పరీక్ష రాసిన వారితో సహా మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి ఎంత మందికి ప్రశ్నాపత్రాలు చేరాయి, వారి ద్వారా ఎవరికి డబ్బులు వెళ్లాయనే కోణంలో సిట్ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు జారీ చేయడంతో వారు సిట్ ఆఫీస్ కు చేరుకున్నారు. దీంతో వారిని విచారిస్తున్నారు.
అయితే పేపర్ ఎలా లీక్ అయ్యిందన్న విషయంలో సిట్ అధికారులకు స్పష్టత వచ్చింది. కాన్ఫిడెన్సియల్ విభాగం ఇంఛార్జి శంకర లక్ష్మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ కొట్టేసి ప్రశ్నపత్రాలు దొంగిలించినట్టు దర్యాప్తు అధికారులు తేల్చారు. అయితే కాన్ఫిడెన్సియల్ విభాగం అంతా కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆధీనంలోనే ఉంటుంది.
కాబట్టి ప్రశ్నాపత్రాల తయారీ, భద్రత, పరీక్షల నిర్వహణ అంశాలకు సంబంధించి సిట్ ఆమెను విచారించే అవకాశముంది. అదే విధంగా ప్రవీణ్ ను గ్రూప్ 1 రాసేందుకు అనుమతి ఇచ్చిన తరువాత అతడ్ని కార్యదర్శి ఎందుకు విధుల నుంచి తప్పించలేదన్న కోణంలో కూడా విచారించనున్నారు. ఇక కమిషన్ సభ్యుడు లింగారెడ్డి దగ్గర రమేష్ సహాయకుడిగా పనిచేస్తున్న క్రమంలో గ్రూప్1 పరీక్ష రాస్తున్నప్పటికి అతడ్ని ఎందుకు విధుల్లో కంటిన్యూ చేశారనే కోణంలో సిట్ ప్రశ్నించనుంది.