మోర్బీ కేబుల్ వంతెన కూలిన ఘటనపై గుజరాత్ హైకోర్టుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక అందించింది. పరిపాలన పరమైన, సాంకేతిక లోపాలను ఇందులో సిట్ ప్రధానంగా ఎత్తి చూపింది. బ్రిడ్జిలోని ఓ ప్రధాన కేబుల్‌లో దాదాపు సగం తీగలు తుప్పు పట్టి ఉన్నాయని నివేదికలో పేర్కొంది.
బ్రిడ్జిలో పాత సస్పెండర్‌లను కొత్త వాటితో వెల్డింగ్ చేయడం లాంటి లోపాలతోనే ప్రమాదం జరిగిందని సిట్ నివేదికలో తెలిపింది. బ్రిడ్జిలోని 49 కేబుల్స్‌లో 22తీగలు అప్పటికే తుప్పు పట్టి వున్నాయని చెప్పింది. ప్రమాదాని కన్నా ముందే అవి తెగిపోయినట్టు వెల్లడించింది.
నివేదిక ప్రకారం… వంతెన కూలిపోయే సమయంలో దానిపై సుమారు 300 మంది వ్యక్తులు ఉన్నారు. వంతెన సామర్థ్యం కన్నా ఎక్కువ బరువు పడింది. ప్లాట్‌ఫాంపై ఉన్న చెక్క పలకలను అల్యూమినియం ప్యానెళ్లతో మార్చడం కూడా ప్రమాదానికి ఓ కారణం. ఆ ప్యానెళ్ల కారణంగా బ్రిడ్జి బరువు కూడా పెరిగింది. చెక్క పలకలు ఉంటే ప్రాణనష్టం తక్కువగా ఉండేది.
వంతెన నిర్వాహణ పనులను ఒరేవా కంపెనీకి అప్పగించడాన్ని సిట్ నివేదిక తప్పుపట్టింది. వంతెన నిర్వాహణ కాంట్రాక్టును ఆ కంపెనీకి మోర్బీ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హా కేటాయించి ఉండకూడదని స్పష్టం చేసింది.
ఈ విషయంలో మోర్బీ మున్సిపాలిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ పేర్లను కూడా ఈడీ ప్రస్తావించింది. కాంట్రాక్టు గురించి జనరల్ బాడీ మీటింగ్ లో చర్చించి దానిపై ఓ నిర్ణయానికి వచ్చి ఉండాల్సిందని తెలిపింది.