ఉత్తరాఖండ్ లోని రిషికేష్ లో జరిగిన అంకితా భండారీ హత్యకేసులో సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇక్కడి రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ గా పని చేసిన అంకితపై లైంగిక దాడి జరగలేదని విసేరా నివేదిక పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 15 న ఈ రిపోర్టు అందిందని ప్రాథమిక శాంపిల్స్ ఈ మేరకు స్పష్టం చేస్తున్నాయని డెహ్రాడూన్ పోలీసు అధికారి వి. మురుగేశన్ చెప్పారు. ఆమెకు సంబంధించిన పోస్ట్ మార్టం నివేదిక కూడా ఇదే అంశాన్ని పేర్కొన్నదని ఆయన తెలిపారు.
పౌరి గర్హ్వాల్ జిల్లా లోని కొట్ద్వార్ కోర్టు నుంచి తాజా నివేదికను తాము సేకరించామన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కావలసి ఉందని, మరో వారం, పది రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరగాలని తాము ఇదివరకే ప్రభుత్వాన్ని కోరామన్నారు.
గత నెల 24 న అంకిత మృతదేహాన్ని రిషికేష్ లోని చిల్లా కెనాల్ లో పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో బీజేపీ మాజీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్యతో బాటు మరో ఇద్దరినీ అరెస్టు చేశారు.
ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 30 మంది సాక్షులను విచారించారు. అంకిత మర్డర్ కేసులో కొంతమంది ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ పి. రేణుకా దేవి హెచ్చరించారు. అలాగే కొన్నిసోషల్ మీడియా సైట్లు, ఛానల్స్ పై లీగల్ చర్యలు చేపడతామని ఆమె చెప్పారు. సిట్ నుంచి అధికారిక సమాచారం లేకుండానే ఇవి తప్పుడు సమాచారం ఇస్తున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.