మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షల్లో భక్తులు వస్తున్నారని.. వారికి కావలసిన జాగ్రత్తలను తీసుకోవాలనే సోయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. లక్షల మంది భక్తులతో రద్దీగా ఉండే రోడ్డులో ఇసుక లారీలను నిలిపివేయాలనే కనీస బాద్యత కూడా లేకుండా పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
ఈ జాతర అయిపోయే వరకు అయినా ఇసుక లారీలను నిలిపివేయాలని అన్నారు. ఇసుక లారీలను ఆపితే టీఆర్ఎస్ నేతల వ్యాపారాలకు అంతరాయం కలుగుతోందని అన్నారు సీతక్క. జాతరకు వచ్చే భక్తులు కరోనా జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ ను తప్పని సరిగా వాడాలని గోడలపై రాసిన రాతలను చెరిపేసే తెలివి ఉన్న టీఆర్ఎస్ నేతలకు.. అందుకు కావలసిన జాగ్రత్తలను తీసుకుంటూ భక్తులకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేయాలనే సోయి లేదా అని ప్రశ్నించారు.
ఇసుక లారీలను నిలిపివేయాలనే కనీస బాద్యత కూడా లేకుండా కమీషన్ ల కోసం ఆరాట పడుతున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితమే ఇసుక లారీ తగిలి ఓ వ్యక్తి మరణించాడని అన్నారు. భక్తులతో రద్దీగా ఉండే రోడ్డులో లారీలను ఆపకుండా ఎంత మంది ప్రాణాలను తీయాలనుకుంటున్నారని మండిపడ్దారు. జాతర సమయంలో ఏ ఒక్క ప్రాణానికి హాని కలిగినా దానికి ప్రభుత్వమే బాద్యత వహించాల్సి వస్తోందని అన్నారు.
ప్రజలకు న్యాయం చేయకున్న ఏం కాదు కానీ.. అన్యాయం మాత్రం చేయొద్దని అన్నారు. గోడలపై తమ అభిమానులు రాసిన కొటేషన్లపై సున్నమేసి కనిపించకుండా చేసే విషయంలో ఉన్న జాగ్రత్త.. జాతరకు వచ్చే ప్రజలకు కల్పించే సదుపాయాలలో చూపించాలని అన్నారు. గోడల మీదున్న పేర్లను చెరపగలరు కానీ.. ప్రజల మనస్సుల్లోని రూపాలను చెరపలేరని అన్నారు. సీఎం కేసీఆర్ కు చిత్త శుద్ది ఉంటే వెంటనే ఇసుక లారీలను నిలిపేలా ఆదేశాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు సీతక్క.