రాములోరి కల్యాణానికి భద్రాచలంలో సర్వం సిద్ధమైంది. సీతారాముల కల్యాణ మహోత్సవానికి మిథిలా స్టేడియంలో కల్యాణ వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సీతారాములు కళ్యాణ మండపానికి వేంచేశారు. కల్యాణ మూర్తులను వేదమంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా లక్ష్మణ సమేత శ్రీ సీతారాములు కల్యాణ వేదికకు చేరుకున్నారు.
కాసేపటి క్రితమే కల్యాణతంతు ప్రారంభమైంది. సరిగ్గా 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుమూహూర్తాన కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇక తెలంగాణ సర్కార్ తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
మరోవైపు అంగరంగ వైభవంగా జరిగే ఈ కల్యాణాన్ని తిలకించడానికి దేశం నలుమూలల నుంచి భక్త జనకోటి భద్రాద్రికి చేరుకుంటోంది. ఈ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం కూడా ఆలయ నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక రేపు రామయ్యకు మహా పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
దీనిలో భాగంగా శుక్రవారం పన్నెండేండ్లకు ఒకసారి నిర్వహించే పుష్కర పట్టాభిషేకం జరగనుంది. మరోవైపు కల్యాణ్ మహోత్సం శాంతియుత వాతావరణం జరగాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండడానికి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.