దేశ ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి నిలకడగా అదుపులోనే ఉందని, కానీ అంచనా వేయలేమని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు. అక్కడ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మన దేశ సైనిక బలగాలు తగినన్ని మోహరించిఉన్నాయన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాల సంఖ్య కొద్దిగా పెరిగిందని, వారి కదలికలను నిశితంగా గమనిస్తున్నామని ఆయన చెప్పారు. ఆర్మీ డే కి ముందు గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నియంత్రణ రేఖ పొడవునా ఎలాంటి అవాంఛనీయ సంఘటననైనా సమర్థంగా ఎదుర్కొనే సత్తా మన జవాన్లకు ఉందని చెప్పారు.
ఇండో-చైనా బోర్డర్ వివాదానికి సంబంధించి చర్చించుకోవలసిన ఏడు అంశాల్లో ఐదింటిని ఉభయ పక్షాలూ పరిష్కరించుకోగలిగాయని, సైనిక, దౌత్య స్థాయిలో కూడా చర్చలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
జమ్మూ కశ్మీర్ లోని పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ.. 2021 ఫిబ్రవరిలో కాల్పుల విరమణకు సంబంధించి కుదిరిన ఒప్పందం బాగానే అమలవుతోందన్నారు. కానీ ఇదే సమయంలో ఉగ్రవాదానికి, టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలకు సీమాంతర మద్దతు కొనసాగుతోందని పరోక్షంగా పాకిస్థాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సాయుధ దళాల్లోని ఆర్టిల్లరీ యూనిట్లలో మహిళా సిబ్బందిని కూడా నియమించడానికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్టు మనోజ్ పాండే తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొందని అయన చెప్పారు.