తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల ముట్టడిలో ముందస్తు అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఏడు సంవత్సరాలుగా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయలేదని ఆరోపించారు. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వలేదన్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ల ముట్టడి కార్యక్రమాల్లో పలుచోట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని చెప్పారు శివసేనారెడ్డి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించడానికి వెళ్లిన యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవి కాంత్ గౌడ్ పై దాడి చేయడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు.
ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు శివసేనారెడ్డి. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి సమయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారని అన్నారు. ఆ సమయంలో జరిగిన ఘర్షణ కారణంగా యువజన కాంగ్రెస్ కార్యకర్త శ్రీనివాస్ నాయక్ కాలు దెబ్బతిందని వివరించారు.
ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు శివసేనారెడ్డి. లేని పక్షంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంట్లో నుండి బయటకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.