ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నూజివీడులోని ఏరియా ఆస్పత్రికి అధికారులు తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందిస్తున్నారు. యూనిట్ 4లోని గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలు వచ్చినట్టు అధికారులు భావిస్తు్న్నారు.
ప్రమాదం జరిగే సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ అక్కడకు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
ఘటన విషయం తెలుసుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.