ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీకూతురు సహా ఆరుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లక్నో-కాన్పూర్ హైవేపై ఆజాద్ మార్గ్ క్రాసింగ్ దగ్గర ఓ ట్రక్కు అదుపు తప్పింది. రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను ఢీకొట్టింది.
అనంతరం రోడ్డు పక్కనున్న వారిపైకి దూసూకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో తల్లి, కూతురు ఉన్నారు. పలువురికి గాయాలు అయ్యాయి. చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించారు. అదుపు తప్పిన ట్రక్కు.. తొలుత కారు, బైకును ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డుపై వెళ్తున్న పాదాచారులపైకి దూసుకెళ్లింది.
అదే సమయంలో ఓ వాహనాన్ని కాల్వలోకి ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు, అల్లుడు మృతి చెందారు. ప్రమాదం తర్వాత గ్రామస్తులు హైవేను దిగ్బంధించారు. రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో బస్సు ధ్వంసమైంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ పై దాడి చేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో పలువురు కారులో చిక్కుకున్నారు. క్రేను సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఉన్నావ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.