ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో దాదాపు ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్టు తెలుస్తోంది. కోబ్రా, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా సక్లార్ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు.. మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ఐదు నుంచి ఆరుగురు నక్సలైట్లు గాయపడ్డారు. సంఘటన స్థలంలో పెద్దసంఖ్యలో బీజీఎల్, ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతున్నదని సుక్మా ఎస్పీ సునీల్ శర్మ వెల్లడించారు.
ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు కోబ్రా జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. బీజీఎల్ పేలుడు వల్ల స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ విషయాన్ని ఇంకా ఏ అధికారి ధృవీకరించలేదని తెలుస్తోంది. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.