అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంట్లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) దాడులు కలకలం రేపుతున్నాయి. విల్మింగ్ టన్ లోని ఆయన ఇంట్లో కీలకమైన ఆరు రహస్య పత్రాలను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుంది. సుమారు 13 గంటల పాటు ఎఫ్‌బీఐ దాడులు నిర్వహించింది.
ఇప్పటి వరకు మొత్తం 12 రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ రహస్య పత్రాలకు కేసును దర్యాప్తు చేసేందుకు రాబర్ట్ హర్ అనే న్యాయవాదిని అటార్నీ జనరల్ గార్లాండ్ నియమించారు. మరోవైపు దీనిపై బైడెన్ తరఫు న్యాయవాది బాబ్ బాయర్ కూడా మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంట్లో ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు నిర్వహించారని అని బాయర్ పేర్కొన్నారు. మొత్తం ఆరు రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. అందులో కొన్ని సెనేట్‌లో బైడెన్ ఉన్నప్పటి పత్రాలు కాగా, మరికొన్ని 2009-16 మధ్య బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటివని చెప్పారు.
న్యాయ శాఖ చేస్తున్న దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని తమను బైడెన్ ఆదేశించారని బైడెన్ వ్యక్తిగత న్యాయవాది రిచర్డ్ సౌబర్ పేర్కొన్నారు. దాడుల సమయంలో అధ్యక్షుడు బైడెన్ గానీ, ఆయన భార్య కానీ ఆ ఇంట్లో లేరని వెల్లడించారు. అధ్యక్షుడి తరఫు న్యాయవాదులు, వైట్ హౌస్ కౌన్సిల్ కార్యాలయం విచారణకు పూర్తిగా సహకరిస్తుందన్నారు.
వాషింగ్టన్ డీసీలోని పెన్ బైడెన్ సెంటర్‌లోని కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేసేందుకు గాను అక్కడ ఉన్న ఫైల్స్ ను బైడెన్ తరఫు న్యాయవాదులు ప్యాక్ చేశారు. ఆ సమయంలో కొన్ని కీలక రహస్య పత్రాలు బయటపడ్డాయి. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఆ కార్యాలయాన్ని 2017 నుంచి 2020 మధ్య జో బైడెన్ వాడుకున్నారు.
ఈ పత్రాలు గతేడాది నవంబరు 2నే బయటపడ్డాయి. ఆ సమయంలోనే వాటి గురించి నేషనల్ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చామని బైడెన్ తరఫు న్యాయవాదుల బృందం పేర్కొంది. అమెరికాలో కొన్ని రహస్య పత్రాలు దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితర ఉన్నత స్థాయిలోని కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. పదవీ కాలం పూర్తి కాగానే వారు ఆ పత్రాలను అమెరికా జాతీయ ఆర్కైవ్స్‌కు అప్పగించి వెళ్లాలనేది నిబంధన.