స్నానానికి నదిలోకి వెళ్లిన ఆరుగురు మృతి చెందిన ఘటన అమరావతిలో చోటుచేకుంది. మరో ఇద్దరు తారాపురం ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. తిరుప్పూర్ నగరం పరిధిలోని మంగళం ఇడుంబి ప్రాంతానికి చెందిన 13 మందితో కూడిన బృందం దిండుగల్ మాంపారై కు వెళ్లారు. అక్కడ నుండి సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు.
అయితే.. మార్గమధ్యంలో మధ్యాహ్నం వేళ అమరావతి నదిలోకి స్నానానికి వెళ్లారు. అయితే.. ఆ నదిలో స్నానానికి నిషేధం విధిస్తూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా వాటిని పట్టించుకోకుండా వెళ్లి మృత్యువాత పడ్డారు.
బైపాస్ రోడ్డును ఆనుకుని ప్రవహిస్తున్న నదిలోకి 8 మంది స్నానానికి దిగారు. హఠాత్తుగా బురదలో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత మరొకరు నీట మునగడాన్ని ఒడ్డు నుంచి చూసిన మిగిలిన వారు కేకలు పెట్టడంతో స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. అయితే.. ఆ నదిలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో రక్షించడం కష్టతరంగా మారిందని స్థానికులు చెప్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి.. ఆరు గురి మృతదేహాలను గుర్తించారు.
ఇద్దరు కొన ఊపిరితో బురదలో కూరుకుపోయి ఉండడంతో వారిని తారాపురం ఆస్పత్రికి తరలించారు. ఇక మృతి చెందిన వారిలో ఇడంబి ప్రాంతానికి చెందిన మోహన్, రంజిత్, శ్రీధర్, యువన్, అమీర్, చక్రవర్తి ఉన్నారు. వీరి మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.