నెల్లూరు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. పొదలకూరు మండలం తోడేరులోని చిన్న చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఐదుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు సోమవారం బయటికి వెలికితీశారు. కళ్యాణ్, ప్రశాంత్, రఘు, శ్రీనాథ్, బాలాజీ మృతదేహాలను చెరువులో నుంచి గజ ఈతగాళ్లు బయటికి తీసుకువచ్చారు. మరో యువకుడు సురేంద్ర కోసం గాలింపు కొనసాగుతోంది.
మొత్తం పది మంది యువకులు ఆదివారం సాయంత్రం బోటుపై చిన్న చెరువులో షికారుకు వెళ్లారు. అయితే బోటు ఒక్కసారిగా తిరగబడటంతో యువకులు నీటిలో పడిపోయారు. అందులో నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా.. మిగిలిన ఆరుగురు గల్లంతయ్యారు.
విషయం తెలుసుకున్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి యువకులు గల్లంతుపై విచారం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఇంత పెద్ద ఘటన మునుపెన్నడూ జరగలేదన్నారు. ప్రమాదం ఘటనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలను ఆదుకునేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కాగా యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.