గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమి వేడుకలే లక్ష్యంగా తనపై ఉగ్రకుట్ర జరుగుతుందన్నారు. అంతే కాదు మార్చి 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీ, రాష్ట్ర బీజేపీ ఆఫీస్ లతోపాటు శ్రీరామ నవమి శోభా యాత్ర ఊరేగింపుపై బాంబ్ బ్లాస్ట్ లు చేయడానికి ఓ ఉగ్రవాద సంస్థ స్కెచ్ వేసిందన్నారు.
ఇదే విషయాన్ని తెలియపర్చుతూ..హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి పోలీస్ కమిషనర్ కు రాసిన లేఖను ఎమ్మెల్యే రాజా సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బహ్రెయిన్ లోని ముఖ్తార్ బ్రిగేడ్స్ లో పనిచేస్తున్న టెర్రరిస్ట్ గోషామహల్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ శాసన సభ్యుడు రాజా సింగ్ ని టార్గెట్ చేసినట్టు పాతబస్తీకి చెందిన ఉమా మహేశ్వరి పోలీసులకు రాసిన లేఖ లో పేర్కొన్నారు.
దీంతో ఈ లేఖలో ఉన్న సమాచారాన్ని హోం మినిస్టర్ మహమూద్ అలీ, డీజీపీ, పోలీసు కమిషనర్లు ధృవీకరించారా.. అని ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నించారు. ఎందుకంటే ఈ శోభాయాత్రలో లక్షలాది మంది రామ భక్తులు పాల్గొంటున్నందుకు తమకు తప్పని సరిగా సరైన సమాచారం ఉండాలని రాజాసింగ్ కోరారు. అయితే ప్రతి ఏటా అత్యంత వైభవంగా చేపట్టే శ్రీరామ నవమి శోభాయాత్రకు ఎమ్మెల్యే రాజాసింగ్ నాయకత్వం వహిస్తూ వస్తున్నారు.