లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులతో వార్తల్లో నిలిచిన జస్టిస్ పుష్ప గనేడి వాలా తన పదవికి రాజీనామా చేశారు. ఆమె బాంబే హైకోర్టులో నాగ్ పూర్ బెంచ్ కు అదనపు న్యాయమూర్తిగా ఉన్నారు. అదనపు న్యాయమూర్తిగా ఆమె పదవీ కాలం శుక్రవారం తో ముగియాల్సి ఉండగా ఒక్క రోజు ముందే ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
గతంలో ఓ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆమె వివాదాస్పద తీర్పు ఇచ్చారు. ఆ కేసులో నిందితుడు బాలికను దుస్తులపై నుంచి తాకాడని ఆమె అన్నారు. ఆ బాలికను అతను స్కిన్ టు స్కిన్ తాకలేదని అందువల్ల ఫోక్సో చట్టం కింద దీన్ని నేరంగా పరిగణించలేమని వివాదాస్పద తీర్పునిచ్చారు.
మరో కేసుల ఐదేండ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులోనూ ఆమె ఇలాంటి తీర్పునే ఇచ్చారు. ఆ కేసులో ఐదేండ్ల బాలికపై 50 ఏండ్ల వృద్దుడు లైంగిక వేధింపులకు దిగాడు. ఈ కేసులో ఆ వృద్ధుడు బాలిక చేతులు పట్టుకుని ఆమె ప్యాంట్ జిప్ విప్పాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ గనేడివాలా సంచలన తీర్పు వెల్లడించారు. జిప్ విప్పినంత మాత్రానా అది ఫోక్సో చట్టం కిందకు రాదని ఆమె అన్నారు.
ఇలా వివాదాస్పద తీర్పుల నేపథ్యంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఆమెకు పూర్తిస్థాయి న్యాయమూర్తి హోదా కల్పించాలన్న ప్రతిపాదనలను సుప్రీం కోర్టు కొలీజియం ఉపసంహరించుకుంది. ఆమె అదనపు న్యాయమూర్తిగా ఉండగా ఆ పదవీ కాలం శుక్రవారంతో ముగియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పదవీ కాలాన్ని పొడిగించడంపైగానీ, ఆమెను పదవీలో కొనసాగించడంపై గానీ ఎలాంటి నిర్ణయమూ కొలిజీయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.