కాశ్మీరీ వేర్పాటువాది ఫరూక్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటేపై శ్రీనగర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. కాశ్మీరి పండిట్స్ సంఘం సభ్యుడైన సతీశ్ టిక్కూ హత్యకు సంబంధించిన కేసుతో సహా అతనిపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్ లపై స్టేటస్ రిపోర్టును అందించాలని కోర్టును పిటిషనర్ అభ్యర్థించారు.
1991లో ఓ ఇంటర్వ్యూలో బిట్టు కరాటే (ప్రస్తుతం నిషేధిత సంస్థ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ లో నాయకుడు) కాశ్మీర్ లోయలో జరిగిన తిరుగుబాటు సమయంలో టిక్కూతో సహా డజన్ల కొద్దీ పండిట్‌లను చంపినట్లు అంగీకరించాడు. దీంతో చాలా మంది పండిట్స్ కశ్మీరి విడిచి వెళ్లిపోయారు.
కానీ ఆ తర్వాత తాను ఎవరినీ చంపలేదని, కేవలం ఒత్తిళ్ల నేపథ్యంలో తాను అలాంటి ప్రకటన చేశానని అన్నారు. బిట్టు కరాటపై టిక్కూ సతీశ్ కుటుంబ సభ్యుల తరఫున న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఉత్సవ్ మాట్లాడుతూ… ఈ పిటిషన్ పై గురువారం తొలి విచారణ జరిగింది. దీనిపై సానుకూలంగా విచారణ జరిపింది. గత 31 ఏళ్లలో ఏం చేశారంటూ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని మందలించింది. ఇది సతీశ్ కుమార్ టికూ కుటుంబానికి ఓ ఆశాకిరణం’ అని అన్నారు.
‘ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 16న షెడ్యూల్ చేశారు. కరాటేపై ఎందుకు ఛార్జిషీట్ దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ‘ అని ఆయన వెల్లడించారు.
1990లో జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద శ్రీనగర్ లో బిట్టూను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి 20006 వరకు జైలులోనే ఉన్నాడు. ఆ తర్వాత నిరవధిక బెయిల్ పై విడుదలయ్యాడు.