ఆస్తిపన్ను స్వీయ మందిపులో తప్పుడు వివరాలు సమర్పించిన ఆసుపత్రికి రూ. 24 కోట్ల జరిమానా విధించారు. ఆస్తిపన్నుకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ ఆసుపత్రికి ఏకంగా రూ.24 కోట్ల జరిమానా విధించారు. హైదరాబాద్ శివారు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో ఈ ఘటన చోటుచేసుకొంది.
బాచుపల్లిలోని ఎస్ఎల్ జీ ఆసుపత్రి 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందుకు గాను 2 సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 9 అంతస్తులకు పర్మిషన్ ఉంది. అయితే వాస్తవానికి 10 లక్షల చదరపు గజాల్లో నిర్మాణ అంతస్తులు ఉండగా.. తాము కేవలం 4 అంతస్తుల్లో 32వేల 300 చదరపు గజాలుగా పేర్కోంటూ ఇటీవల యాజమాన్యం సెల్ఫ్ అసిస్‌మెంట్ కు దరఖాస్తు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.
నిజాంపేట నగరపాలక సంస్థ అధికారులు ఆసుపత్రి సమర్పించిన సదరు వివరాలు తప్పుగా ఉన్నాయని పేర్కొంటూ అధికారులు రూ. 24 కోట్లకు పైగా జరిమానా విధించారు.
తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం దరఖాస్తుదారుడు స్వీయ ఆస్తిపన్ను మదింపులో ఇచ్చిన వివరాలు తప్పుగా ఉంటే.. సదరు ఆస్తి విలువకు 25 రెట్ల జరిమానా విధిస్తారు. ఆ ప్రకారం.. ఆ ఆసుపత్రికి రూ. 24 కోట్ల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.